పెనుతుఫాను

1
నిరాశ్రయుల ఆశ్రయంగా
అన్నార్తుల ఫలాలుగా పచ్చగా
ఎదగాలనుకున్నాను కానీ స్వార్థం
నన్ను కూకటివేళ్లతో పెకిలించింది

2
మానవత్వ పరిమళాల్ని
వికసింప సమతాసుమంగా
మొగ్గతొడగాలనుకున్నాను కానీ
మతమౌఢ్యచీడ అంకురదశలోనే
నన్ను కబళించింది

3
కులకుట్రల అగ్గి పై
కుండనీటినవ్వాలనుకున్నాను
కానీ కులగజ్జి ముంతనీటిగానే
నన్ను ముక్కలు చేసింది

4
దాచిన సత్యాల్ని
చాటిజెప్ప సరికొత్త చరిత్ర
పుస్తకమవ్వాలనుకున్నాను కానీ
బూర్జువా చెదపురుగులు నా పుటల్ని మేసి,
పెంటపుటల్ని కానుకిచ్చేయి

5
మూగబోయిన గళాల నవస్వరమై
రవళించాలనుకున్నాను కానీ ..
కత్తికోకండగా నన్ను కాకుల – గద్దల
ఆహారంగా విసిరారు

6
కానీ .. ఇది నా అంతమనీ
మీ జబ్బలుజరుచుకునే
ఈ మిడిసిపాటు ఏలనోయి ?
కానొస్తలేదా ..? మీ కుతంత్రాల
కుంపట్లపై కవనజలఖడ్గవృష్ఠిగా
విరుచుకపడనున్న పెనుతుఫాను
పవనంగా పలకరించిన నా రాక

-:ఇస్లావత్ గోవర్ధన్ నాయక్:-