నక్షత్రాలు 27

 

ఆకాశంలో చంద్రుడి గతిని పరిశీలిస్తే, నెల మొత్తంమీద ఒక్కో నక్షత్ర మండలముతో పాటుగా సంచరిస్తున్నట్లు గోచరిస్తున్నది. దీనినే పురాణ గాథలో అందంగా, ఆ నక్షత్రదేవతలు చంద్రుడి భార్యలు అని వివరించారు. వాస్తవానికి ఈ పేర్లతో ఉన్నది ఒక నక్షత్రగోళం కాదు. కొన్ని నక్షత్ర తేజః పుంజాల సమూహం. అందువల్లే వేదంలో కొన్ని చోట్ల ద్వివచనం, మరికొన్నిచోట్ల బహువచనాలను, కొన్ని చోట్ల ఏకవచనాలను ప్రయోగించారు.

ఈ నక్షత్ర మండలాల గురించిన విస్తారమైన ప్రస్తావన వేదమంత్రాలలో ఉన్నది. జ్యోతిస్సు అంటే నక్షత్రము. దీనికి సంబంధించిన విషయము కాబట్టే జ్యోతిష్యము అనే పేరు కూడ వచ్చినది. కాబట్టి, కష్టాలలో ఉండేవారు, నక్షత్రాలను, వాటి అధిదేవతలనూ స్మరించేందుకై నక్షత్ర జపం అనే సంప్రదాయం కూడ ప్రసిద్ధమైనది.

నక్షత్రాణ్యథ వక్ష్యన్తే వేదోక్త క్రమ నామతః।
కృత్తికా రోహిణీ చైవ మృగశీర్ష స్తథా ర్ద్రకా।।
పునర్వసూ తిష్య ఏవ తథాశ్రేషా మఘాః క్రమాత్।
పూర్వోత్తరే చ ఫల్గున్యౌ చ హస్త శ్చిత్రోపి తారకాః।।
నిష్ట్యా విశాఖే సంఖ్యాతే అనూరాధా హి జ్యేష్ఠకా।
మూలః పూర్వోత్తరాషాఢా అభిజిచ్చ విశేషభం।।
శ్రోణా శ్రవిష్ఠా శ్చ శత భిషగ్వేదే తు చోదితః। ।
పూర్వోత్తరాః ప్రోష్ఠపదాః రేవత్యశ్వయుజౌ తతః।।
ఉత్తమా తారకోక్తాప భరణ్యో భాని ఖే క్రమాత్।
అశ్విన్యాదీని వేదాంగే నక్షత్రాణి స్మృతాని వై।।

వేదములో, కృత్తికతో ప్రారంభించి ఈ నక్షత్రముల వరుస క్రమాన్ని చెప్పారు. కానీ, లోకంలో సాధారణంగా జ్యోతిష్కులంతా అశ్వినీ నక్షత్రముతో గణన ప్రారంభిస్తారు. అభిజిత్ అనే నక్షత్రం ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల మధ్యనున్నది. అక్కడక్కడా, దీనిని పరిగణిస్తారు.

ఈ నక్షత్రాలలో కొన్నిటిని పుంలింగములోనూ, మరికొన్నిటిని స్త్రీలింగములోనూ బోధించారు. (నక్షత్రదేవతలకు స్వేచ్ఛ ప్రకారంగా తమ లింగాన్నీ, రూపాన్నీ మార్చుకునే శక్తిని పరమేశ్వరుడు ప్రసాదించాడని పురాణ గాథ)

1. (అశ్వినీ) అశ్వయుఙ్నక్షత్రం 2. (అప) భరణీ నక్షత్రం 3. కృత్తికా నక్షత్రం 4. రోహిణీ నక్షత్రం 5. మృగశీర్ష నక్షత్రం 6. ఆర్ద్రా నక్షత్రం 7.పునర్వసు నక్షత్రం 8. తిష్య నక్షత్రం 9. ఆశ్రేషా నక్షత్రం 10. మఘా నక్షత్రం 11. పూర్వ ఫల్గునీ నక్షత్రం 12. ఉత్తర ఫల్గునీ నక్షత్రం 13. హస్త నక్షతం 14. చిత్రా నక్షత్రం 15. (స్వాతీ) నిష్ట్యా నక్షత్రం 16. విశాఖా నక్షత్రం 17. అనూరాధ నక్షత్రం 18. జ్యేష్ఠా నక్షత్రం 19. మూల నక్షత్రం20. పూర్వాషాఢా నక్షత్రం 21. ఉత్తరాషాఢా నక్షత్రం (21 అభిజిత్ నక్షత్రం) 22. (శ్రవణ) శ్రోణా నక్షత్రం 23. (ధనిష్ఠ) శ్రవిష్ఠా నక్షత్రం 24.శతభిషఙ్నక్షత్రం 25. (పూర్వాభాద్ర) పూర్వప్రోష్ఠపద నక్షత్రం 26. (ఉత్తరాభాద్ర) ఉత్తర ప్రోష్ఠపద నక్షత్రం 27. రేవతీ నక్షత్రం

కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు . వారిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు – అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.

నక్షత్ర సంజ్ఞా విధము
1. క్షిప్ర నక్షత్రములు :- అశ్వని, హస్త, పుష్యమి
2. దారుణ నక్షత్రములు :- మూల, ఆరుద్ర, జ్యేష్ట, ఆశ్రేష
3. మృదు నక్షత్రములు :- చిత్త, రేవతి, మృగశిర, అనూరాధ
4. స్థిర నక్షత్రములు :- రోహిణి, ఉత్తరాషాడ, ఉత్తరా బాద్ర
5. చర నక్షత్రములు :- స్వాతి, పునర్వసు, శ్రవణము, ధనిష్ట, శతతార
6. ఉగ్ర నక్షత్రములు :- భరణి, మఖ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభాద్ర
నక్షత్రాలు – దేవతలు
అశ్వని – అశ్వని దేవతలు, భరణి – యముడు, కృత్తిక – అగ్ని, రోహిణి – బ్రహ్మ, మృగశిర – చంద్రుడు, ఆరుద్ర – శివుడు, పునర్వసు – అదితి, పుష్యమి – గురుడు, అశ్రేశ – సర్పములు, మఖ – పితృదేవతలు, పుబ్బ – బృగుడు, ఉత్తర – అర్యముడు, హస్త – సూర్యుడు, చిత్త – ఇంద్రుడు, స్వాతి – వాయుడు, విశాఖ – ఇంద్రాగ్నులు, అనూరాధ – మిత్రులు, జ్యేష్ట – దేవేంద్రుడు, మూల – రాక్షసుడు, పూర్వాషాడ – ఉదకములు, ఉత్తరాషాడ – విశ్వేదేవతలు, శ్రవణం – విష్ట్నువు, ధనిష్ట – వసువులు, శతభిషం – వరుణుడు, పూర్వ భాద్ర – అజచరణుడు, ఉత్తరా భాద్ర – ఆహిర్భుద్నుడు, రేవతి – పూషుడు
ఒక్కొక్క నక్షత్ర ప్రమాణము =360
ఒక్కొక్క నక్షత్రము నాలుగు పాదాలు.