Monthly Archives: May 2018

ముహూర్త భాగము లో చక్రశుధ్దులు

 

(1)వివాహ చక్రశుద్ధి:- వివాహ ముహూర్త సమయమునకు సూర్యస్థిత నక్షత్రము నుండి అనగా సూర్యుని నుండి ముహూర్త నక్షత్రం వరకు లెక్కించంగా మెుదటి మూడు నక్షత్రములు(123) అయినచో వివాహమైన 8 సంవత్సరముల లోగా వధూవరులకు అరిష్టము కలుగును. 2వ మూడు అనగా 4,5,6 నక్షత్రములు శుభ ప్రధము,తరువాత మూడు నక్షత్రములు 7,8,9 సంతాన లోపము, తరువాత మూడు నక్షత్రములు 10,11,12 వైధవ్యము,తరువాత మూడు నక్షత్రములు 13,14,15 కళత్రమూలక గౌరవ,సుఖ,శాంతులు,ఆపై మూడు నక్షత్రములు 16,17,18 మరణప్రదము, తదుపరి మూడు నక్షత్రములు 19,20,21 వ్యభిచారదోషము,ఆపై మూడు నక్షత్రములు 22,23,24 ధనధాన్యవృద్ధి,సర్వ సంపత్తులు కలుగ గలవు.
(2)మాంగళ్య చక్రశుద్ధి:-వివాహ ముహూర్త సమయమునకు శుక్ర స్థితి నక్షత్రము నుండి వివాహ ముహూర్త నక్షత్రము వరకు లెక్కించగా 1,2,3 నక్షత్రములు అనారోగ్యం, అటుపై 4,5,6 తారలు లక్ష్మీ ప్రదము, తరువాత 7,8,9 తారలు దుర్భలము, 10,11,12 తారలు దారిద్ర్యము విష బాధ, 13,14,15 తారలు సర్వ సౌభాగ్యాములు, 16,17,18 తారలు సుఃఖభంగము వైధవ్యము దారిద్ర్యము,19,20,21 తారలు జారత్వదోషము,అటుపై 22,23,24 తారలు కుటుంబ వృద్ధి కలుగును.
(3)ఉపనయన చక్రశుద్ధి:-వటుని జన్మ నక్షత్రము నుండి ముహూర్త నక్షత్రము వరకు లెక్కించగా మెుదటి 5 నక్షత్రములు సుఖము, అటుపై 6,7,8 తారలు ఆచార హీనము, 9వ నక్షత్రము మూర్ఖత్వము, 10 నుండి 17 నక్షత్రములు అనారోగ్యము,18,19 తారలు బ్రహ్మ తేజస్సు, 20 నుండి 27 నక్షత్రములు విద్వాంసునిగా చేయును.ఇక రెండవ పద్ధతి:- వటుని జన్మ నక్షత్రము నుండి ముహూర్త సమయమునకు గల గురు సంచార నక్షత్రము వరకు లెక్కించి పై విధముగానే చూసి ముహూర్తమును నిర్ణయించవలెను.
(4)గృహారంభ చక్రశుద్ధి:-రవి యున్న నక్షత్రము నుండి ముహూర్త నక్షత్రము వరకు లెక్కించగా 1,2,3 దహనము,4,5,6,7 శూన్యము,8,9,10,11 స్థిరత్వం,12,13,14 ధన లాభం,15,16,17,18 సర్వత్ర లాభం,19,20,21 గృహ యజమాని నాశనము,22,23,24 కష్టములు,25,26,27 జయము కలుగును.ఈ చక్రశుద్ధి గృహారంభమునకు చూడవలెను.
(5)వృషభ చక్రశుద్ధి:-రవి యున్న నక్షత్రము మెదలు గృహప్రవేశ నక్షత్రము వరకు అభిజిత్తు తో గూడా లెక్కించగా 1,2,3 తారలు మృత్యువు, 4,5,6,7 దరిద్రము, 8,9,10,11 స్థిరత్వము, 12,13,14 ప్రయాణములు, 15,16,17,18 సంపద,19,20,21,22 ధ్యానము, 23,24,25 ఐశ్వర్యము,26,27,28 పశువృద్ధి ఈ చక్రశుద్ది గృహప్రవేశము నకు చూడ వలెను.
(6)కళశ చక్రశుద్ధి:- రవి యున్న నక్షత్రము మెదలు గృహప్రవేశ నక్షత్రము వరకు లెక్కించగా 1 శిరశ్ఛేధము, 2,3,4,5 విదేశీ గమనము, 6,7,8,9 నిర్ణయము, 10,11,12,13 భాగ్య వృద్ధి, 14,15,16,17 దరిద్రము,18,19,20,21 గర్భస్రావము, 22,23,24 సంపద, 25,26,27 పూర్ణాయువు.ఈ చక్రశుద్ధి గృహప్రవేశము నకు ముఖ్యంగా చూడవలెను.

చింతా గోపి శర్మ సిద్ధాంతిFB_IMG_1532495002290

నక్షత్రాలు 27

 

ఆకాశంలో చంద్రుడి గతిని పరిశీలిస్తే, నెల మొత్తంమీద ఒక్కో నక్షత్ర మండలముతో పాటుగా సంచరిస్తున్నట్లు గోచరిస్తున్నది. దీనినే పురాణ గాథలో అందంగా, ఆ నక్షత్రదేవతలు చంద్రుడి భార్యలు అని వివరించారు. వాస్తవానికి ఈ పేర్లతో ఉన్నది ఒక నక్షత్రగోళం కాదు. కొన్ని నక్షత్ర తేజః పుంజాల సమూహం. అందువల్లే వేదంలో కొన్ని చోట్ల ద్వివచనం, మరికొన్నిచోట్ల బహువచనాలను, కొన్ని చోట్ల ఏకవచనాలను ప్రయోగించారు.

ఈ నక్షత్ర మండలాల గురించిన విస్తారమైన ప్రస్తావన వేదమంత్రాలలో ఉన్నది. జ్యోతిస్సు అంటే నక్షత్రము. దీనికి సంబంధించిన విషయము కాబట్టే జ్యోతిష్యము అనే పేరు కూడ వచ్చినది. కాబట్టి, కష్టాలలో ఉండేవారు, నక్షత్రాలను, వాటి అధిదేవతలనూ స్మరించేందుకై నక్షత్ర జపం అనే సంప్రదాయం కూడ ప్రసిద్ధమైనది.

నక్షత్రాణ్యథ వక్ష్యన్తే వేదోక్త క్రమ నామతః।
కృత్తికా రోహిణీ చైవ మృగశీర్ష స్తథా ర్ద్రకా।।
పునర్వసూ తిష్య ఏవ తథాశ్రేషా మఘాః క్రమాత్।
పూర్వోత్తరే చ ఫల్గున్యౌ చ హస్త శ్చిత్రోపి తారకాః।।
నిష్ట్యా విశాఖే సంఖ్యాతే అనూరాధా హి జ్యేష్ఠకా।
మూలః పూర్వోత్తరాషాఢా అభిజిచ్చ విశేషభం।।
శ్రోణా శ్రవిష్ఠా శ్చ శత భిషగ్వేదే తు చోదితః। ।
పూర్వోత్తరాః ప్రోష్ఠపదాః రేవత్యశ్వయుజౌ తతః।।
ఉత్తమా తారకోక్తాప భరణ్యో భాని ఖే క్రమాత్।
అశ్విన్యాదీని వేదాంగే నక్షత్రాణి స్మృతాని వై।।

వేదములో, కృత్తికతో ప్రారంభించి ఈ నక్షత్రముల వరుస క్రమాన్ని చెప్పారు. కానీ, లోకంలో సాధారణంగా జ్యోతిష్కులంతా అశ్వినీ నక్షత్రముతో గణన ప్రారంభిస్తారు. అభిజిత్ అనే నక్షత్రం ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల మధ్యనున్నది. అక్కడక్కడా, దీనిని పరిగణిస్తారు.

ఈ నక్షత్రాలలో కొన్నిటిని పుంలింగములోనూ, మరికొన్నిటిని స్త్రీలింగములోనూ బోధించారు. (నక్షత్రదేవతలకు స్వేచ్ఛ ప్రకారంగా తమ లింగాన్నీ, రూపాన్నీ మార్చుకునే శక్తిని పరమేశ్వరుడు ప్రసాదించాడని పురాణ గాథ)

1. (అశ్వినీ) అశ్వయుఙ్నక్షత్రం 2. (అప) భరణీ నక్షత్రం 3. కృత్తికా నక్షత్రం 4. రోహిణీ నక్షత్రం 5. మృగశీర్ష నక్షత్రం 6. ఆర్ద్రా నక్షత్రం 7.పునర్వసు నక్షత్రం 8. తిష్య నక్షత్రం 9. ఆశ్రేషా నక్షత్రం 10. మఘా నక్షత్రం 11. పూర్వ ఫల్గునీ నక్షత్రం 12. ఉత్తర ఫల్గునీ నక్షత్రం 13. హస్త నక్షతం 14. చిత్రా నక్షత్రం 15. (స్వాతీ) నిష్ట్యా నక్షత్రం 16. విశాఖా నక్షత్రం 17. అనూరాధ నక్షత్రం 18. జ్యేష్ఠా నక్షత్రం 19. మూల నక్షత్రం20. పూర్వాషాఢా నక్షత్రం 21. ఉత్తరాషాఢా నక్షత్రం (21 అభిజిత్ నక్షత్రం) 22. (శ్రవణ) శ్రోణా నక్షత్రం 23. (ధనిష్ఠ) శ్రవిష్ఠా నక్షత్రం 24.శతభిషఙ్నక్షత్రం 25. (పూర్వాభాద్ర) పూర్వప్రోష్ఠపద నక్షత్రం 26. (ఉత్తరాభాద్ర) ఉత్తర ప్రోష్ఠపద నక్షత్రం 27. రేవతీ నక్షత్రం

కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు . వారిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు – అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.

నక్షత్ర సంజ్ఞా విధము
1. క్షిప్ర నక్షత్రములు :- అశ్వని, హస్త, పుష్యమి
2. దారుణ నక్షత్రములు :- మూల, ఆరుద్ర, జ్యేష్ట, ఆశ్రేష
3. మృదు నక్షత్రములు :- చిత్త, రేవతి, మృగశిర, అనూరాధ
4. స్థిర నక్షత్రములు :- రోహిణి, ఉత్తరాషాడ, ఉత్తరా బాద్ర
5. చర నక్షత్రములు :- స్వాతి, పునర్వసు, శ్రవణము, ధనిష్ట, శతతార
6. ఉగ్ర నక్షత్రములు :- భరణి, మఖ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభాద్ర
నక్షత్రాలు – దేవతలు
అశ్వని – అశ్వని దేవతలు, భరణి – యముడు, కృత్తిక – అగ్ని, రోహిణి – బ్రహ్మ, మృగశిర – చంద్రుడు, ఆరుద్ర – శివుడు, పునర్వసు – అదితి, పుష్యమి – గురుడు, అశ్రేశ – సర్పములు, మఖ – పితృదేవతలు, పుబ్బ – బృగుడు, ఉత్తర – అర్యముడు, హస్త – సూర్యుడు, చిత్త – ఇంద్రుడు, స్వాతి – వాయుడు, విశాఖ – ఇంద్రాగ్నులు, అనూరాధ – మిత్రులు, జ్యేష్ట – దేవేంద్రుడు, మూల – రాక్షసుడు, పూర్వాషాడ – ఉదకములు, ఉత్తరాషాడ – విశ్వేదేవతలు, శ్రవణం – విష్ట్నువు, ధనిష్ట – వసువులు, శతభిషం – వరుణుడు, పూర్వ భాద్ర – అజచరణుడు, ఉత్తరా భాద్ర – ఆహిర్భుద్నుడు, రేవతి – పూషుడు
ఒక్కొక్క నక్షత్ర ప్రమాణము =360
ఒక్కొక్క నక్షత్రము నాలుగు పాదాలు.

అధిక మాసం… జ్యేష్ఠ మాసం

పంచాంగ గణనం ప్రకారం సౌరమాన సంవత్సరానికీ చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంబావు రోజుల తేడా ఉంది. చాంద్రమాన సంవత్సరం సౌరమాన సంవత్సరం కంటే చిన్నది. ఇదే విధంగా చాంద్రమాన మాసం సౌరమాన మాసం కంటే చిన్నది. ఈ కారణంగానే ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ప్రారంభమవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో సాధారణంగా వచ్చే సూర్యసంక్రమణం ఉండదు. ఇలా వచ్చే చాంద్రమాసాన్ని అధికమాసంగా వ్యవహరిస్తారు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు రెండు నెలలపాటు ఒకే రాశిలో ఉండటం వల్ల ఏర్పడేదే అధికమాసం. ఇందులో మొదటి నెలలో రవి సంక్రాంతి ఉండదు. అధిక మాసం ఎప్పుడూ చైత్రమాసం నుంచి ఆశ్వయుజ మాసం మధ్యలోనే వస్తుంది. ఈ సంవత్సరం మే 16 నుంచి అధికజ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. జూన్‌ 14 నుంచి నిజజ్యేష్ఠ మాసం మొదలవుతుంది. అధిక మాసంలో నిత్యం చేసుకునే పనులు తప్ప మిగతా ఏ శుభకార్యాలూ చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. శివకేశవుల ఆరాధనా, జపతపాదులూ, దానాలూ, నదీస్నానాలూ, తీర్థయాత్రలూ ఎక్కువచేస్తే మంచిది. మరణ సంబంధమైన క్రతువులు అంటే మాసికం, ఆబ్దికం మొదలైనవి అధిక, నిజమాసాలు రెండింటిలో చేయాల్సి ఉంటుంది. అధికమాసంలో వచ్చే మహాలయ పక్షాలు పితృకర్మలకు విశిష్టమైనవిగా చెబుతారు.