Monthly Archives: January 2018

_*మాఘపురాణం -9వ అధ్యాయము

 
_*పుష్కరుని వృత్తాంతము*_
☘☘☘☘☘☘☘☘
ఈవిధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవుతులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారితో ఇటుల నుడివెను. –
“పూజ్యులైన ఓ మహర్షీ! ఈ భూలోకమునకు, యమలోకమునకు దూరమెంత?” చనిపోయిన ణా ముగ్గురు కన్యల ప్రాణములెంత కాలములో వెళ్ళి వచ్చినవి?” అని ప్రశ్నించెను.
వశిష్ఠుళ వారు దీర్ఘముగా నాలోచించి యిటుల బదులు చెప్పిరి. “మాహారాజా! అందరు తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలూ పుణ్యవతులు. వారొకసారి మాఘమాసములో స్నానమాచరించి యున్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరల బ్రతుక గలిగినారు.
దీనికొక ఉదాహరణ వివరింతును ఆలకింపుము. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతం కడు చిత్రమైనది.
పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు. సకల జీవులయందు దయగలవాడు. పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందునూ, నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడువకుండ చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు, భజించుచు జీవితమును గడుపుచున్న పరమభక్తుడు.
ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడ్కొని రండని తన భటుల కాజ్ఞాపించినాడు. యమభటులు వెంటనే పోయి యా విప్రపుంగవుని ప్రాణములు దీసి యమునివద్ద నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనా నిమగ్నుడై ఉండెను. భటులు తోడ్కొని వచ్చిన పుష్కరునివైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను. యమ ధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరెను.
యముడు భటుల వంక కోపంగా చూచి – “ఓరీ భటులారా! పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామమందే మరియొకడు గలడు. వానిని తీసుకురాకుండా యీ ఉత్తముని ఏల తీసుకు వచ్చితిరి?” అని గర్జించుసరికి గడగడ వణికిపోయిరి.
యమధర్మరాజు పుష్కరుని వైపు జూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు” అని చెప్పెను. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూచి పోవుదును” అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతించెను.
పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరుల పాడుచున్న నరక బాధలను చూడసాగెను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షల ననుభవించుచుండుట పుష్కరుడు కనులారాగాంచెను.
అతనికి అమితమగు భయము కలిగెను. తన భయం బోవుటకు హరినామ స్మరణ బిగ్గరగా చేయసాగెను. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమతమ పాపములను పోగొట్టుకొనుచుండిరి. వారి శిక్షలు ఆపు చేయడమైనది. యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించుచుండెను.
ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగివచ్చిన వారున్నారు. ఇది నిజము.
మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు.
అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్యగరపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను.2018-01-17-11-38-24-865

మాఘపురాణం – 8వ అధ్యాయము*

 

_*యమలోక విశేషములు*_

☘☘☘☘☘☘☘☘

మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి మేల్కాంచినటుల లేచి, వారు యమలోకమందు చూచిన వింతలూ, విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి.
యమలోక మందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తానూ చేసిన పాపకర్మలకెంతటి శిక్షలననుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపినీ ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపజేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు. అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయింది.
అపుడా కన్యలు వారిని ఓదార్చి “మీరు భయపడకుడు. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయమొక్కటే యున్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖముల ననుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీస్నానము చేయుట తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు యిత్యాది పుణ్యకార్యములు చేయుటవలన నంతకుముందు చేసియున్న పాపములన్నియు పటాపంచలై నశించుటయే గాక, స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. గాన మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్దమయినది.
మాఘమాసమందు నదీస్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను, లేక వినినను, శ్రీహరి దయకు పాత్రులగుదురు గాన మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుట కంతకంటే సులభమార్గము మరియొకటి లేదు” అని వారి తల్లిదండ్రులకు వివరించిరి.2018-01-17-11-38-24-865

రథ సప్తమి

 

హిందువుల్లో ఈ పండగ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొంది.  మాఘమాసంలో వచ్చే శుక్ల పక్ష సప్తమి నాడు “రథసప్తమి” జరుపుకొంటారు. రథసప్తమి ఈ సంవత్సరం (2018) జనవరి 24 తేదీన జరుపుకొంటున్నారు. ఈ రోజే సూర్య దేవుడు జన్మించాడని, అందుకే రథసప్తమి నాడే సూర్యుని జన్మదినమైనందున “సూర్యజయంతి”గా భావించడం జరుగుతుంది.
రథసప్తమి ఎంతో పవిత్ర దినం. ఈరోజు సూర్యగ్రహణం రోజు పాటించే అన్ని ఆచారాలను భక్తులు పాటిస్తారు. అంతే కాకుండా ఈరోజు సుర్యారాధన కావించి దానధర్మలను చేసే భక్తులకు ఈ జన్మలోను, గడిచిన జన్మలలోను తెలిసీ తెలియక చేసిన తప్పులు, పాపాలు నుండి ప్రక్షాళింపపబదతారని ప్రతీతి.

*ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్* అంటే ఆరోగ్యాన్ని భాస్కరుడు అంటే సూర్యుడు ప్రసాదిస్తాడు కాబట్టి దీనినే ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు.
సూర్య గ్రహణ పర్వదినంతో సమాన పుణ్యప్రదం రథ సప్తమి :-*

_సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ_
_అరుణోదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్_
_మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యదా_
_కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః_

ఈ రోజు అరుణోదయ వేళ స్నానం చేయాలి :-*

అరుణోదయము అంటే సూర్యోదయానికి గంటన్నర పూర్వ సమయము. *అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలమ్* అని పురాణాల్లో పేర్కొనబడినది కావున అరుణోదయ సమయంలో స్నానం చేస్తే మహాఫలం లభిస్తుంది.ఏమిటా మహా ఫలమంటే _ఆరోగ్యం_ .కావున ఈ ఒక్క రథ సప్తమి రోజే కాకుండా ప్రతిరోజూ ఇలా స్నానమాచరించడం ఆరోగ్యప్రదం.

స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు తలపై పెట్టుకోవాలి :-*

గర్గ మహాముని ప్రబోధము ప్రకారం రథ సప్తమి రోజు స్నానమాచరించేటప్పుడు తలపై 7 జిల్లేడు ఆకులను ఉంచుకోవాలి.జిల్లేడుకు సంస్కృతములో అర్క అని పేరు.సూర్యుడి కూడా అర్కః అని పేరు.కావున సూర్యుడికి అర్క పత్రము అనగా జిల్లేడు పత్రము మిగుల ప్రీతి.

సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి :-*

_మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యదా._ … రథ సప్తమి రోజు నదీ స్నానము విశేషం.స్నానమాచరించి సూర్యుని వైపు ముఖం చేసి అర్ఘ్యము వదిలితే కోట్ల రేట్ల పుణ్యం లభిస్తుంది.సూర్యగ్రహణం రోజు ఎలా స్నాన , జపదానాదులు చేస్తే పుణ్యఫలం లభిస్తుందో తత్ సమానమైన పుణ్యం రథ సప్తమి రోజు చేసే స్నాన-దాన-జపాదుల వలన వస్తుంది.

ఈ రోజున ఆదిత్య హృదయం పారాయణం విశేషం :-*

రథ సప్తమి రోజు విధిగా స్నానమాచరించి ఆదిత్య హృదయంను పారాయణం చేయడం వలన కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది.

ఈ వస్తువులు దానం చేయండి :-*

సూర్యుడికి ఎరుపు రంగు అత్యంత ప్రీతికరము.ఎరుపు రంగు వస్త్రము , గోధుమలు , బంగారము , ఎరుపు పూలు యథాశక్తి బ్రాహ్మణులకు దానం చేయాలి.అపాత్ర దానం చేయకూడదని గరుణ పురాణంలో పేర్కొనబడినది.కావున సంస్కార హీనులైన బ్రాహ్మణులకు కాకుండా నిత్య దేవతార్చన , యజ్ఞ హోమాలు , జపతపాదులు చేసే యోగ్యమైన బ్రాహ్మణులకు దానం చేయడం వలన దాన ఫలం లభిస్తుంది.

రథ సప్తమి వ్రతమును ఆచరించాలి :-*

భవిష్యోత్తర పురాణములో రథ సప్తమి వ్రత విధానము విశేషంగా వర్ణించబడినది.
రథ సప్తమి వ్రత కథను శ్రీకృష్ణుడు … ధర్మరాజుకు తెలియజేశాడు.2018-01-23-20-00-56-116

_*మాఘపురాణం – ఏడవ అధ్యాయం

_*మాఘపురాణం – ఏడవ అధ్యాయం*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉

మృగ శృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట
ఆవిధంగా ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మ రాజును గురించి తపస్సు చేయ నారంభించినాడు.
నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోరదీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయి – “మృగశృంగా నీ కఠోరదీక్షకు, పరోపకార పరాయణతకు నేనెంతయు సంతసించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలయునో కోరుకొనుము. నీ యభీష్టం నెరవేర్చెదను” అని యముడు పలికెను.
ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచి చూడగా యముడు తన ఎదుట నిలబడియున్నాడు. వెంటనే చేతులు జోడించి “మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరుకాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని జేయుడు” అని ప్రార్థించెను.
మృగశృంగుని పరోపకార బుద్ధికీ, దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనేంచి “మృగశృంగా! నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకార బుద్ధి నన్నాకర్షించింది. నీకు జయమగుగాక” అని యముడు దీవించగా –
మహాపురుషా! మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము సోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు. అట్టివారికి అన్ని విధముల శుభములు కలుగునటుల అనుగ్రహింపుము అని ప్రార్థించగా –
*“అటులనే నీ కోరిక సఫలమగుగాక”* యని యమధర్మరాజు దీవించి యద్రుశ్యుడయ్యెను.2018-01-17-11-38-24-865

వసంత పంచమి

మాఘశుద్ధ పంచమినే వసంత పంచమి అంటారు. ఈ రోజు సరస్వతీ పూజ చేయడం మంచిది. వసంత పంచమిని సరస్వతీ దేవి పుట్టిన రోజుగా పేర్కొంటారు.
“మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ
పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయతః శుచిః – అంటే మాఘ శుక్ల పంచమినాడు, విద్యారంభంనాడు ప్రాతఃకాలాన సరస్వతిని అర్చించాలి. తొలుత గణపతిని పూజించి, అటుపై శారదాంబ ప్రతిమను, పుస్తకాలను, లేఖినిని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి.

సరస్వతీ దేవిని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో అర్చించాలి. వసంత పంచమినే శ్రీపంచమి అని కూడా పిలుస్తారు. శ్రీపంచమి దక్షిణ భారతదేశంలో అంతగా ప్రచారం లేకపోయినప్పటికీ, ఉత్తర భారతదేశంలో ఈ పంచమి నాడు సరస్వతీ దేవిని అత్యంత శ్రద్ధతో పూజిస్తారు.

ఆదిశంకరుడు అపారమైన వాఙ్మయాన్ని, తత్వవిజ్ఞానాన్ని ఈ తల్లి కృప చేతనే పొందినట్లు పేర్కొనడమే గాక శారదానుగ్రహం వలన మనమందరం సమగ్ర జ్ఞానంతో ఎదగగలమని చాటాడు. గాయత్రిగా, సావిత్రిగా, పరాశక్తిగా శ్రుతులు పేర్కొన్న సర్వచైతన్య స్వరూపిణి శారద. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారని విశ్వాసం.

‘యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా
సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః..’ అన్న శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ దేవి కాబట్టి. అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీ దేవీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. సరస్వతీ దేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారని పండితులు సూచిస్తున్నారు. images (3)

_*మాఘపురాణం -5 వ అధ్యాయం*

 

_*మృగ శృంగుని చరిత్ర*_

☘☘☘☘☘☘☘☘

ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక ‘కౌత్సు’డని పిలవబడుచున్ననూ ఆతనిని “మృగశృంగు”డను పేరుతొ పిల్చుచుండిరి. అదెటులనగా అతడు కావేరీ నదీతీరమున ఘోర తపస్సు చేసియున్నాడు గదా! అప్పుడాతను శిలవలె నిలబడి దీక్షతో తపస్సు చేసుకొను సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు, జంతువులు, తమయొక్క శృంగములచే నతనిని గీకెడివి. అందుచేత అతనికి ‘మృగశృంగు’డను పేరు సార్ధకమయ్యెను.
వివాహమాడు కన్య గుణములు
మృగశృంగునాకు యుక్తవయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహము చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగ శృంగుడు వారిమాట లాలకించి ఇట్లు పలికెను. “పూజ్యులగు తల్లిదండ్రులారా! నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. ఐననూ నా అభిప్రాయము గూడ ఆలకింపుడు. అన్ని ఆశ్రమాలకంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణ మేమనగా ప్రతి పురుషునకు తనకనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికీ ఉదాహరణగా స్త్రీయెటులుండవలయుననగా –
శ్లో: కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా
శయనేషు రంభా రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ!
ఇవి ఆరు ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించియున్నారు. అనగా యింటి పనులలో దాసీవలెను, రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయన మందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లి వలెను, రూమున లక్ష్మి వలెను, శాంతి స్వభావములో భూదేవి వలెను స్త్రీ ఆరువిధముల వ్యవహరింప వలెను.
అంతియేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థము, కామము, మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనెంచిన మిగతా మూడున్నూ అనవసరం. ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏవిధంగా సాధించునో కామమును గూడా అట్లే సాధించవలయును.
ప్రతి మానవుడు వివాహం చేసుకొనే ముందు కన్యయోక్క గుణగణములు తెలుసుకొనవలయును. జీవిత సుఖములలో భార్య ప్రధానమయినది. కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు.
గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక, అట్టి మనుజుడు ధర్మ-అర్థ-కామ-మోక్షములను అవలీలగా సాధించగలడు.
భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదై యున్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములనుభవించుచు మరల నరక కూపమునకే పోగలడు. గనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటులన కన్య ఆరోగ్యవతియై యే విధమైన రోగాగ్రస్తురాలై ఉండకూడదు. యెంత అందమయినదైననూ మంచి కుటుంబములోని కన్యయై యుండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయి, దేవా బ్రాహ్మణులను పూజించునదియై, అత్తమామల మాటలకు జవదాటనిదై యుండవలెను.
ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు. గాన అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలయును. అయినా అదెటుళ సాధ్యపడును? అని మృగ శృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో నున్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లు పలికెను.
“కుమారా! నీమాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైననూ మంచి నీతులు నేర్చుకొన్నావు. నీయభీష్టం నెరవేరవలయునన్న ణా దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము” అని పలికెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏2018-01-17-11-38-24-865

_*మాఘ పురాణం – 4వ అధ్యాయము*_

 

_*కుత్సురుని వృత్తాంతము:*_

☘☘☘☘☘☘☘☘

పులి ముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను.
పూర్వకాలమున కుత్సురుడను పేరుగల విప్రుడొకడుండెను. అతడు కర్దమమునియొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునకా దంపతులకు ఒక కుమారుడు జన్మించెను.

కుమారునికి అయిదవ యేడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసముయెట శ్రద్దజూపుట, నీతి నియమాలను పాటించుట, దైవకార్యములయందు భక్తి కలిగియుండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములనభ్యసించెను.

ఈవిధంగా కొంతకాలం గడచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్తవయస్సు వచ్చెను. అతనికి దేశాటనకు బోవలయునని కోర్కె కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు, మాఘమాసం వచ్చునప్పటికి కావేరీ నదీ తీరమునకు చేరుకున్నాడు.

“నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది. ఇది నా భాగ్యం” అని ఆ విప్ర యువకుడనుకొని సంతృప్తి చెందెను.

మాఘమాసమంతయు ఇచటనేయుండి అధికఫలమును సంపాదించెదను” అని మనమున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యమూ ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను. ఆవిధముగా నదీ తీరమున మూడు సంవత్సరములుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను. ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోరతపమాచరించవలయుననీ తలంచి ఆ సమీపమందొక పర్వతముపై తపస్సు చేసికొన సంకల్పించి తపస్సుజేయ మొదలిడెను. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ, నిశ్చల మనస్సుతోనూ, తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను.
ఆ విప్రయువకుడు కన్నులు తెరచి చూచుసరికి శంఖ, చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో వున్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు.

ఈవిధముగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావమునకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను.
ఓ విప్రకుమారా! నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకొంటివి. అది ఎటులనగా నీవు నిడవకుండ అనేక పర్యాయములు మాఘమాసములో నదీ స్నానము చేసి తపశ్శాలురు కూడా పొందని మాఘమాస పుణ్య ఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది. గాన నీకేమి కావలయునో కోరుకొనుము. నీ అభీష్టము నెరవేర్చెదను” అని శ్రీమన్నారాయణుడు పలికెను.

శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై – ప్రభూ జగద్రక్షకా! సర్వాంతర్యామీ! ఆపద్బాంధవా! నారాయణా! ఆ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏవిధమైన సుఖాలు కోరుటకు నా మనస్సంగీకరించలేదు. మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిపుడు కలుగగా మరొక కోరిక కోరగలనా? నాకింకేమియు అవసరము లేదు. కానీ మీ దివ్యదర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శ మిచ్చుచుండవలెను. అదియే నాకోరిక” అని ప్రార్థించెను.

శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చెద గాక! అని పలికి నాటినుండీ అచటనే ఉండిపోయెను.

కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులై వున్నా తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలడిగిరి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏2018-01-17-11-38-24-865

*మాఘపురాణం – 3వ అధ్యాయము*

*వింధ్య పర్వతము:*_

☘☘☘☘☘☘☘☘

దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లు చెప్పదొడంగెను. భూపాలా! నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు, పశువులు, చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని, దేవతార్చనలు గాని, చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకోను మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదలి వలస పోవుచుంటిరి. అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరులేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుట లేదు.
మహా తపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక పోయాడు. ఎన్నో సంవత్సరాలనుండి ఆ ప్రాంతమందుండుటవలన అచటినుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు.
హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచరియ వున్నది. ఆ కొండచరియ అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా వున్నది. అది తెల్లగా కూడా వున్నది. ఆ కొండచరియయందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండవద్దకు వచ్చి శ్రీమన్నారాయణు భక్తిభావముతో ప్రార్థించిరి. అంతియేగాక ఆ పర్వతమువద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు” అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను.
“ఓ మహానుభావా! ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి. ఇంకను విశేషములున్న తెలుపగోరెదను” అని ప్రార్థించెను.
మరల వశిష్ఠులవారు ఇట్లు చెప్పిరి. “రాజా! నీయభీష్టం ప్రకారమే వివరింతును. సావధానుడవై ఆలకింపుము.
“ ఆ పర్వతరాజము కడు వింతయైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్య మృగములు, అనేక రకముల పక్షులతో నున్న ఆ అప్ర్వటం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తుగలదియై అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను” అట్లు కొంతకాలం గడచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకొనుచున్న భృగుమహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.
గంధర్వ యువకుని వృత్తాంతము:
“భృగుమహర్షీ! నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించిననూ పులిమొగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగెనో బోధపడకున్నది. ఆమె ణా భార్య అతిరూపవతి, గుణవంతురాలు మాహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. గాన ణా యీ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాదను తొలగింపజేయుడు” అని పరిపరి విధముల ప్రార్థించెను. భృగుమహర్షి గంధర్వుని దీనాలాపము నాలకించెను. ఆతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది. ఆ గంధర్వుని కెటులైనను తన శక్తికొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని ఇట్లనెను.
“ఓయీ గాంధర్వ కుమారా! నీవు అదృష్టహీనుడవు. అదృష్ట హీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడునూ మనుజుని కృంగదీయును. ఈ మూడింటినీ నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. గావున నీవు నీ భార్యతో గూడ పర్వతం నుండీ ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియునుగాక యిది మాఘమాసము గదా! వెళ్ళబోయిన తీర్థమెదురైనట్లు అన్నియు సమకూడుతున్నవి. ఈరోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ యీడేరును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను.
ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములాలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్దపులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గాంధర్వ దంపతులు అమితానందం నొందిరి.
అంత వారిద్దరూ భృగుమహర్షి కడకువచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. భృగువు వారలను దీవించి పంపివైచెను.
ఈవిధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠులవారు దిలీపునకెరిగించి, “వింటివా రాజా! గంధర్వ కుమారుని వృత్తాంతం? మాఘమాసములో పుణ్యనదులయందు స్నానమాచరించిన యెడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏2018-01-17-11-38-24-865

మంచినీ, సంకల్పాన్నీ తట్టిలేపే కథ””

“”మంచినీ, సంకల్పాన్నీ తట్టిలేపే కథ””

ఒకానొక చిన్న పల్లెటూరు. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిషపండితుడు నివసించేవాడు.

ఆయన చెప్పిన మాట పొల్లుపోదనీ చెప్పి ఫలితం తప్పుకాదనీ ఆ ఊరి ప్రజల విశ్వాసం.

ఆ నోటా ఈ నోటా విన్న ఓ పేదరైతు పక్కనున్న గ్రామం నుంచి జ్యోతిషుని దగ్గరకు వచ్చి తనకు జోస్యం చెప్పమనీ తన జాతకాన్ని అతనికి ఇస్తాడు.

తనపై నమ్మకముంచి వచ్చినందుకు ఆ పేదరైతుకు కూర్చోమని సైగచేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు.

ఎటువంటి జాతకాలను చూసినా చలించని ఆ జ్యోతిషుడు పేదరైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు.

ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేదరైతుకు ఆనాటి రాత్రి ప్రాణ గండం కనిపించడం వల్లనే.

ఎంతటి నిజాన్నైనా చెప్పగలను కానీ రైతుతో సూటిగా నీకు ప్రాణగండం ఉందని ఎలా చెప్పనని చింతించి ఎలాగోలా తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా ఇవాళ నాకు చాలా పనిఉంది.

మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి. రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశితంగా పరిశీలించి చెబుతాను అని అంటాడు.

జ్యోతిషునిపై మర్యాదతో ఆ పేదరైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు.

రైతు వెళ్ళగానే జ్యోతిషుడు తన భార్యతో విషయం చెబుతాడు.

కానీ మనసులో పాపం పేదరైతు నేడు మరణిస్తాడే. నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్ళిపోయాడేనని చింతిస్తాడు జ్యోతిషుడు.

పేదరైతు జ్యోతిషుని ఇంటినుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళుతున్నాడు. దారిలోనే చీకటి పడటంతో తలదాచుకోవడానికి స్థలాన్ని వెదకడం మొదలుపెట్టాడు.

ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిలావస్థలో శివుని ఆలయం కనిపించిందతనికి. అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు.

ప్రజలకు మనఃశ్శాంతినీ, భక్తి భావాలనూ పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే. నా దగ్గర డబ్బుండుంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాణ్నిని మనసులో అనుకుంటాడు.

మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి. రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి.

మండపాలు ఎలాకడితే బాగుంటుంది. అలా పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలూ, పూజలూ నిర్విఘ్నంగా జరుగుతుంటే ఎంత బాగుంటుందనీ శివుని ఆన ఉంటే తప్పక అది జరుగుతుందనీ అనుకుంటుండగానే మండపం పైభాగంలోంచి నల్లని త్రాచుపాము అతనిని కాటు వేయడానికి అతనిపై దూకపోతుంటే తప్పించుకొని ఆ ఆలయం నుండి బయటకు వచ్చేస్తాడు.

మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.

అమ్మయ్య! బతికి పోయాననుకొని ఇంటికి చేరుకుంటాడా పేదరైతు.

మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకొని జ్యోతిషుని దగ్గరకు వెళతాడు పేదరైతు.

అతణ్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిషుడు నా గణనలో తప్పు జరిగి ఉంటుందని చాలా శాస్ర్తాలను తిరగేసి మళ్ళీ మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు.

కానీ గణింపులో ఎక్కడా తేడాలేదు. అంతా సరిగ్గానే ఉంది. ఇక తప్పదన్నట్లు విషయం పేదరైతుకు వివరించి జ్యోతిషుడు నిన్న ఏం జరిగిందో ఏదీ మర్చిపోక తెలియజేయమని రైతుకు చెబుతాడు.

జరిగిందంతా వివరిస్తాడు పేదరైతు.

మంచి చేయాలని కేవలం తలింపు మాత్రంగా అనుకున్నందుకే ఇంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి చేస్తే ఎటువంటి జీవితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం.

మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలు సత్సంకల్పాలయితే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది.

ప్రపంచం బాగుంటే అందులోని మనం కూడా బాగుంటాం.

అందుకే అంటారు అందరూ మంచిగా ఉండాలి. మంచివారి సంకల్పాలూ మంచిగా ఉండాలి.

మాఘ పురాణం – 2వ అధ్యాయం*_

_*మాఘ పురాణం – 2వ అధ్యాయం*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉

_*దిలీప మహారాజు వేటకు బయలుదేరుట:*_

☘☘☘☘☘☘☘☘

దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.
దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.
దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.
అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.
ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.
“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.
“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను.
ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.
దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట:
దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను.
ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.
దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.
అవును మహారాజా. నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు.
మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.
అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏2018-01-17-11-38-24-865