డిజిటల్ స్నేహం మీద నా అభిప్రాయం

డిజిటల్ స్నేహం మీద నా అభిప్రాయం చెప్పగానే ఒక “మేతావి” ‘ ఎవర్నైనా పట్టుకుంటే తప్ప నీ దూల తీరదా..?’ అంటూ వెటకారాలాడాడు. ఇంకొకరికి ఫోన్ చేస్తే “only text please.” అంటూ ఆటో మెస్సేజ్ వస్తుంది. తను నన్ను “సూటిగా, సుత్తి లేకుండా , సొల్లెయ్యకుండా పాయింట్ చెప్పు ..!” అంటున్నారని అర్ధమైపోతుంది.

ఆలోచనలని, భావాలని యథాతథంగా చెప్పడానికి రాత కన్నా మాటే ముఖ్యమని నేను నమ్ముతాను. ఈ “పాయింటు కి రా..!” అనే లక్షణం మన ఓపిక లేనితనాన్ని గుడ్డలిప్పి ప్రదర్శిస్తుంది. తోటివాళ్ళ ఆలోచనలతో సహగమించలేని అలసత్వాన్ని, మొరటుతనాన్ని నిర్లజ్జగా కళ్ళకు కట్టిస్తుంది. పుష్కరాల వయస్సున్న స్నేహసంబంధాలు instant messenger లోకి కుదింప బడుతున్నాయి. ఇత్తడి గ్లాసు లోని ఫిల్టర్ కాఫీ కాపుచినో కప్పైపోయింది. Social Media అపరిచితుల contacts పెంచింది. సుపరిచితుల connections తుంచింది. మనసు లో శూన్యాన్ని చేర్చింది. మెదడు లో చెత్తని పేర్చింది.

24/7 hyper connectivity మనుషుల మధ్య దూరాన్ని శత సహస్ర యోజనాలుగా పెంచేసింది. దీని విశ్వరూపం ఇంతింతై బ్రహ్మాండాంత సంవర్ధియై, నయాపైసా ఖర్చు లేకుండా ఫ్లోరిడా స్నేహితులతో చాటింగ్ చేయిస్తోంది. కానీ, పక్క ఫ్లాట్ వృద్ధుడిని బాల్కనీ లోనుండి కూడా పలకరించలేనంత మొద్దు బారేలా చేసింది.
Messages పెరిగాయి. Meetings తరిగాయి.చెప్పడం పెరిగింది; వినడం తరిగింది. “I am little pre occupied yaar..! Let’s catch up some time soon..” అనే ముక్తాయింపు వాస్తవమైతే అదో ఎనిమిదో వింత.

పొట్టిక్కలో, పెసరట్లో, మొలక వడలో తింటూనో; ఉదయం కాఫీ మగ్గుతోనో సాయంత్రం విస్కీ పెగ్గుతోనో అప్పుడప్పుడైనా కలిసేవాళ్ళం. ముఖాముఖంగా మాట్లాడుకునే వాళ్ళం.కళ్ళ కలయికలతో సమస్త సృష్టి వర్ణ చిత్రాన్ని ఆవిష్కరించే వాళ్ళం. కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, కౌగిలించుకునే వాళ్ళం, ఏడిచే వాళ్ళం, ఏడిపించే వాళ్ళం, నవ్వే వాళ్ళం, నవ్వించే వాళ్ళం.

అంతా మారిపోతోంది.పెళ్ళిళ్ళకి వచ్చే బంధువులు తగ్గారు. Reception కి వచ్చే సహోద్యోగులు పెరిగారు. యంత్రాలకు మనిషి మేధస్సుని జత కలిపే పనిలో పడ్డ మనిషి యంత్రమై పోయాడు.మన భావాలు emoticons లా మరుగుజ్జు రూపం దాల్చాయి. కప్పెట్టిన వాళ్లకి పెడుతున్న RIP లు చిరాకు తెప్పిస్తున్నాయి.మోక్షానికి విశ్రాంతి ఏంటో నా కోడి (బోడి) బుర్రకి అర్ధం కావడం లేదు.

నిజమే..! ఈ రుద్దబడుతున్న తద్దినానికి మనం మెల్లమెల్లగా అలవాటు పడిపోతున్నాం. కానీ,ఒక sense of relatedness, belongingness, understanding మృగ్యమై పోతున్నాయని దిగులేస్తోంది. నాలాంటివాడు పొరపాటున ఈ విషయం కెలికితే “టైం ఎక్కడుందీ..? “పాత వాగుడు వాగకు…!” అంటూ తిలక్ ఎప్పుడో రాసిన న్యూ సిలబస్ ని ఇప్పటికీ వల్లె వేస్తున్నారు.

నిజమే..! మనది బిజీ టైం. కానీ మనం నెమ్మదించడం అత్యవసరం. సుఖపడేందుకు కుప్పలు కుప్పలుగా మార్కెట్ లో డంప్ అవుతున్న వస్తువుల్లో మనను ఆనందపరచే ఆవిష్కరణలు మైక్రోస్కోపు తో వెదికితే ఒకటో, అరో దొరుకుతాయేమో..! మైథునం మార్కెట్లో కూడా దొరుకుతుంది. కానీ శృంగారపు చిరునామా సందింటి లోనే కదా..!

కొత్తతరపు communications వల్ల సంభాషణా చాతుర్యం, సహానుభూతి లాంటి మానవ సహజ లక్షణాలు అంతర్దానమైపోతున్నాయి. ఎదుటి వ్యక్తి నిజాయితీ తో తో కూడిన మెచ్చుకోలు; నిష్కామ స్నేహం కన్నా మననేవీ సంతృప్తి పరచలేవు. తెలిసిన నాలుగు ముక్కలు తెలిసిన నలుగురితో పంచుకోకుండా లోలోపలే పెట్టేసుకోవడం ఫ్లాట్ బీర్ అంత ; చీకట్లో కన్ను కొట్టడం అంత నిష్ప్రయోజనం.

లింగబేధంతో నిమిత్తం లేకుండా ఎవరి సలహా నన్ను ముందుకు నడిపిస్తుందో; ఎవరి విమర్శ నన్ను ఆపుతుందో; ఎవరి చేతి రుమాలు నా కన్నీటిని తుడుస్తుందో; ఎవరి కలయిక నా దుఃఖాన్ని దునుమాడుతుందో; ఎవరి విరహం నా సంతోషాన్ని మింగేస్తుందో; ఎవరి మాట నన్ను శ్రోతని చేస్తుందో; ఎవరి శ్రద్ధ నన్ను వక్తని చేస్తుందో; ఎవరి కోసం చావాలని అనుకుంటానో; ఎవరి కోసం చంపాలని అనుకుంటానో ఆ రక్త మాంసాలతో నిండి ఉన్న సజీవ మూర్తికి నా పాదాభివందనాలు; ఆత్మీయ ఆలింగనాలు…! Gottimukkula KamalakarFB_IMG_1489294231564