” నేనున్నాను…”

మిత్రులారా ఒక నాలుగు రోజుల సీరియల్ రాయాలని ఈ రోజే మొదలుపెట్టాను సీరియల్ పేరు ” నేనున్నాను “.

” నేనున్నాను…” (మొదటి రోజు)

సమయం సరిగ్గా సాయంకాలం నాలుగు గంటలు కావొస్తోంది. అది సముద్ర తీర ప్రాంతం. సాయంకాలపు షికారుకి వచ్చిన జనాలతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతోంది. సముద్రుడు తన అలలతో అక్కడికి వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలుకరిస్తున్నాడు. ఆ సమయంలోనే ఒక యువకుడు అక్కడికి వచ్చాడు, అతని పేరు ‘వాసు’ అతనో మంచి చిత్రకారుడు. ‘వాసు’ తనతో పాటు తెచ్చుకున్న డ్రాయింగ్ స్టాండ్ ఒక చోట వుంచి, దానిపైన పాడ్ అమర్చాడు. సముద్రం నుంచి వస్తున్న గాలికి స్టాండ్ పడిపోకుండా జాగర్తలు తీసుకున్నాడు. బాగ్ లోనుంచి కావలసిన మెటీరియల్ బయటకు తీసాడు. రంగులు జాగర్తగా కలిపాడు…ఓ సారి సముద్రం వేపు చూసాడు. పాడ్ మీద బొమ్మ వేయడం మొదలు పెట్టాడు..ఆ క్షణం నుంచి అతను పరిసరాలను మరచిపోయ్యాడు. తదేకంగా తను అనుకున్న బొమ్మ వేయడంలో నిమగ్నమై పోయాడు.
సమయం ఆరు గంటలు కావొస్తోంది, సన్నని చీకట్లు కమ్ముకోసాగాయి. అప్పటికే ‘వాసు’ గీయాల్సిన బొమ్మ పూర్తి అయ్యింది. క్షణ కాలం ఆగి బొమ్మని ఒకసారి తృప్తిగా చూసుకున్నాడు. అది ఒక అందమైన అమ్మాయి బొమ్మ, ఆ అమ్మాయి అందాన్ని మాటల్లో వర్ణించలేము. అంత ఆద్భుతంగా ఉందా చిత్రం.
ఈలోగా అతని వెనకాల కాస్త దూరంగా ఎదో అలికిడి వినిపించింది. ఆ అలికిడికి వాస్తవం లోకి వస్తూ తిరిగి చూసాడు. ఒక యువతి పరిగెత్తుకుంటూ వస్తోంది, ఆమెని నలుగురు దుండగులు తరుముతూ వస్తున్నారు. ఆ యువతీ స్పీడ్ గా పరిగెత్తుకుని వచ్చి ‘వాసు’ ని అడ్డు చేసుకుంటూ దాక్కో సాగింది, ‘వాసు’ కి అయోమయంగా అనిపించింది. ఈలోపు ఆమెని తరుముతున్న నలుగురు దుండగులు అక్కడికి చేరుకున్నారు. ‘వాసు’ వెనక దాక్కున్న ఆ అమ్మాయిని కోపంగా చూస్తూ, ” ఏయ్ మర్యాదగా లొంగిపో, నిన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ” అంటారు, ఆ మాటలకి ఆమె మరింత భయపడుతూ ‘వాసు’ ని గట్టిగా పట్టుకుంది. అది చూసిన ఒక దుండగుడు ‘ రేయ్ నువ్వేమైనా సినిమాలో హీరో అనుకుంటున్నావా? వదిలేయ్ ఆ అమ్మాయిని లేకుంటే నీకూ పెళ్లి అవుతుంది ‘.. అనగానే ‘వాసు’ ఏమీ అర్ధం కాని పరిస్థిలో దిక్కుతోచక వాళ్ళనే చూడసాగాడు. ఈ లోగా ఆ దుండగులు వారిద్దరిపై దాడి చేసారు…’వాసు’ గీసిన బొమ్మని లాగి చించి పాడవేస్తారు…స్టాండ్ ని , రంగులనీ చిందర వందర చేసారు..అప్పటిదాకా ఆ అమ్మాయిని సరిగా గమనించని ‘వాసు’ ఆమెని చూసి షాక్ అవుతాడు. ఆమె ఎవరో కాదు అంతకు ముందు తను గీసిన బొమ్మలోని అమ్మాయే…
దుండగులు ఆ అమ్మాయిని లాక్కొని వెళ్తున్నారు, కన్ఫ్యూజన్ నుంచి ఇంకా బయటపడలేదు ‘వాసు’, ఆ అమ్మాయి ‘వాసు’ నే చూస్తూ రక్షించమని అరుస్తోంది. ‘వాసు’ ఒక్కసారిగా తల విదిల్చి దుండగులు బలవంతంగా లాక్కుని వెళ్తున్న ఆమె వేపు వేగంగా పరిగెత్తాడు……..(సశేషం)
రెండవభాగం రేపు…..
మీ బోయనపల్లి రమణ ( రచయిత )

FB_IMG_1466864198779